సోనియా గాంధీకి గుడి?

తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తమ అధినేత సోనియా గాంధీకి గుడి కట్టించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. సుమారు 26 ఏళ్లుగా తాము ఆత్మత్యాగాలతో పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అటువంటిది సోనియా అతి తక్కువ వ్యవధిలో తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని ఈ తెలంగాణా నాయకులు భావిస్తున్నారు. సోనియా గాంధీకి ఎంత చేసినా ఈ ఋణం తీరదంటూ స్వామి భక్తిని ప్రకటిస్తున్న వీర తెలంగాణా వాదులు అతి త్వరలో ఆమె అధిష్టాన దేవతగా ఓ పెద్ద గుడిని కట్టించాలని నిర్ణయించుకున్నారు.

ఈ గుడి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని మాజీ మంత్రి, సికందరాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు అయిన పి. శంకర్ రావ్ ప్రకటించారు. ఆయన తన నియోజకవర్గంలో సోనియాకు గుడిని నిర్మించడంతో తృప్తి చెందేలా కనిపించడం లేదు. తెలంగాణా ప్రాంతంలోని ప్రతి కాంగ్రెస్ శాసనసభ్యుడు తమ తమ నియోజకవర్గంలో సోనియాకు గుడి కట్టించాలని ఆయన కోరారు. త్వరలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి. అయిదారు నెలల్లో అన్ని వసతులతో దాన్ని పూర్తి చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

వచ్చే డిసెంబర్ 9న సోనియా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన నియోజకవర్గంలో నిలువెత్తు సోనియా విగ్రహాన్ని ఆవిష్కరించాలని, ఆవిష్కారం రోజున ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన స్వామీ భక్తి భజనపరత్వానికి పరాకాష్టగా కనిపించవచ్చు గానీ, సోనియా గాంధీకి ఆంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి చోటా సమాధులు నిర్మించాలని సీమాంధ్ర నాయకులు పిలుపునివ్వడంతో ఆయన సోనియాకు గుడి విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

1 Comment

  1. బ్రతికున్నవాళ్ళకు ఎవరైనా ఎక్కడయినా గుడి కడతారండీ! ఇది జాతి సంప్రదాయం కాదే. ఈ మాటన్నవారు సామాన్యులు కాదే. నాయకులూ, ప్రజాప్రతినిధులూను. ఎంత తప్పండీ ఈ మాట!
    బ్రతికున్నవాళ్ళకు గుడి కడితే సమాధి అవుతుంది.ఏదో సినీమాలో,అనార్కళీ అనుకుంటా, ఇష్టం లేక
    సమాధి కట్టారు గదాండి.

Send a Comment

Your email address will not be published.