స్వర సాధన బహు సుందరం

DSC_1547
DSC_1230

గాన సరస్వతి నాట్యమాడింది. చదువుల తల్లి సంబరపడిపోయింది. వాగ్దేవి వరాలిచ్చింది. వాక్కులతల్లి అక్కున చేర్చుకుంది. వేదాగ్రణి వందనమో అంది. పలుకుజిలుకలకొల్కి పల్లవించింది. శారదాంబ ఆశీర్వదించింది. విద్యాదేవి వెన్నెల కాచింది. స్వరవాణి చత్రిని పట్టుకుంది.

సద్గురువుల ఆశీర్వాదం, సంప్రదాయాల సహవాసం, వాగీశ్వరి కటాక్షం, స్వరాల సమారోహం, తరతరాల పరంపర, భావితరాలకు అందివ్వాలన్న తపన, పదేళ్ళ అకుంటిత దీక్ష, పరదేశ సంస్కృతిలో మన సంప్రదాయాల వెల్లువ, వందనమో సరస్వతి వాణీ పుస్తక వాహిని.

“స్వర సాధన” వారి దశమ వార్షికోత్సవంలో విద్యార్ధులు ప్రదర్శించిన గాత్ర సంగీతలహరి అద్భుతం. అయిదేళ్ళ వయసు నుండి అరవైయేళ్ళ వయసువారు కూడా విద్యార్ధులుగా చేరి మనదైన కర్ణాటక సంగీతాన్ని శ్రీమతి సుందరి సరిపల్లె గారి దగ్గర నేర్చుకొని స్వరాలు పల్లవులై ఆలపించిన తీరు అమోఘం.

DSC_2243
DSC_2619
DSC_1932
సంగీతం నేర్చుకోవడంలో రెండు ముఖ్యమైన లాభాలున్నాయి.
1. మనిషి మెదడులోని ఎడమ భాగం భాష, తర్కం విశ్లేషణకు ఉపయోగపడుతుంది. అయితే సంగీతం సాధన చేసే వారికి ఈ భాగం ఎక్కువగా పనిచేసి విద్వత్సంబంధమైన విషయాలలో మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది
2. సంగీతం సంఘటితశ్రమ (Team Work) కు దోహదపడుతుంది. సామూహికంగా పాడుతున్నప్పుడు ప్రతీ సభ్యుడు/సభ్యురాలు వారు పాడుతున్న పాట బాగుండాలని కోరుకుంటారు కానీ వ్యక్తిగతంగా తాను కేంద్రబిందువు కావాలని అనుకోరు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఎంతో చక్కగా పద ఉచ్చారణ చేసి గురువులు నేర్పిన విద్యను అత్యంత గౌరవంతో, భక్తి భావంతో ప్రదర్శించడం ముదావహం. గాత్ర సంగీతానికి దీటుగా వయోలిన్, మృదంగం, ఘటం వాయిద్యకారులు ఎంతో ముచ్చటగా సాంప్రదాయ దుస్తుల్లో తమ సహకారాన్ని అందించిన తీరు ప్రశంసనీయం. గాత్ర వాయిద్య మేలి కలయిక కొంతమందికి కంట తడి పెట్టించిందంటే అతిశయోక్తి కాదు. మన సంగీతానికున్న ప్రతిభ అటువంటిది.

స్వర సాధన దశమ వార్షికోత్సవం పురస్కరించుకొని మెల్బోర్న్ నగరంలో ఉన్న చాలా సంగీత కళాశాలల అధ్యాపకులను సన్మానించడం జరిగింది. వారిలో మన తెలుగువారు మాణిక్యవీణ వ్యవస్థాపకులు శ్రీమతి రమణి బొమ్మకంటి గారు, కృష్ణ రవళి వ్యవస్థాపకులు శ్రీమతి రామారావు గూడూరు గారు వున్నారు. వీరితో పాటు లయవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీధరాచారి మరియు రాగసుధ వ్యవస్థాపకులు శ్రీ మురళీ కుమార్ గారు తదితరులు వున్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన విక్టోరియన్ మల్టీ కల్చరల్ కమీషనర్ శ్రీ చిదంబరం శ్రీనివాసన్ స్వరసాధన వెబ్సైటు www.swarasadhana.com ని ప్రారంభించారు. శ్రీ చిదంబరం మాట్లాడుతూ కర్ణాటక సంగీత సౌరభాలను అందిస్తున్న శ్రీమతి సుందరి గారిని మరియు శ్రీ సూర్యనారాయణ గారిని ప్రశంసించారు.
DSC_2195
DSC_2257

Send a Comment

Your email address will not be published.